||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పది నాలుగవ సర్గ ||

||"ఆనందః నరం ఏతి" !||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుస్త్రింశస్సర్గః

తత్త్వదీపిక
"ఆనందః నరం ఏతి"

"భార్యా రామస్య ధీమతః' అంటూ తన పరిచయము చెప్పుకొని,
"తతః త్యక్ష్యామి జీవితం"అంటూ తన స్థితిని వెల్లడించిన
సీతాదేవి యొక్క దుఃఖభరితమైన మాటలు వినిన హనుమంతుడు,
ఆమెను ఓదారుస్తూ ఇలా అంటాడు.

'ఓ దేవీ నేను రాముని దూతను.
నీకు రాముని సందేశముతో వచ్చితిని.
వైదేహీ ! కుశలముగానున్న రాముడు నీ యొక్క కుశలము అడుగుచున్నాడు.
వేదములలో పారంగతుడు,
బ్రహ్మాస్త్రముగురించి వేదములగురించి తెలిసినవాడు అగు ఆ దాశరథి
నీ కుశలము గురించి అడుగుతున్నాడు.
నీ భర్త అనుచరుడు మహాతేజోవంతుడు అగు లక్ష్మణుడు
శోకసంతాపముతో నీకు శిరసాభివందనము చేయుచున్నాడు'.

ఆ ఇద్దరు నరసింహుల కుశలము వినిన సీత
ఆనందముతో పులకరించబడినదై హనుమంతునితో ఇట్లు పలికెను.
'నరుడు వందసంవత్సరములు బతికినచో తప్పక ఆనందము పొందును అన్న లౌకికము
ఎంత మంగళకరమో నాకు తెలియుచున్నది'.

ఆ 'లౌకికము' అన్నమాట ఇది.
"ఏతి జీవన్తి మానందో నరం వర్ష శతాదపి"
"జీవించియున్న నరునికి నూరేండ్లకైననూ ఆనందము కలుగును"

రామలక్ష్మణులు కుశలముగా వున్నారని వినిన సీతకి,
నూరేళ్ళు బ్రతికిఉంటే సుఖములను పొందవచ్చు అనే
లౌకికమైన మాట నిజము అని అనిపించింది.

ఆ మాట లౌకికమే కాదు,
అది అధ్యాత్మిక సత్యము కూడా అని అంటారు అప్పలాచార్యులుగారు.

ఆనందమే పరబ్రహ్మము.
దానికి దూరమైన జీవుడు దుఃఖము పొందును.
అనేక జన్మల నెత్తును.
ఎన్నో జన్మల తరువాత అయినా చివరికి జీవుడు భగవదాభిముఖము కలిగి,
ఆనందమగు పరబ్రహ్మమమును పొందును.
అది తథ్యము.
అందుచే జీవితము ఆనందముతోనే అంతమగును.
జీవితము ఒక జన్మ తో ముగియునది కాదు.
పరమాత్మకు విముఖుడై దూరమైన జీవుడు
పరమాత్మకు అభిముఖుడై పరమాత్మను చేరుట ఒక జీవితము.

అదే నూరేళ్ళు బ్రతికిన మానవుడు ఆనందము పొందడము.

జీవితము ఎప్పుడూ సుఖముతోనే అంతమగును.
అందుకే భారతీయ సంప్రదాయములో
జీవితమునకు ప్రతిబింబములగు
పౌరాణికములు నాటకములు సుఖాంతముగా వుంటాయి.

ఇంకోమాట.
ఇక్కడ నరుడు ఆనందము పొందలేదు.
ఆనందము నరుని పొందును.
"ఆనందః నరం ఏతి"

నరుడు తనంత తానుగా భగవంతుని పొందలేదు.
భగవదభిముఖము కలిగి ,
భగవంతుని పొందవలెనని ఆర్తి కలిగినచో,
ఆ ప్రేమకు వశమై భగవంతుడే నరుని పొందును.

భగవత్ప్రాప్తి అందరకు కలుగునా ?
ఎట్లు భవత్ప్రాప్తి కలుగును?
ఎన్నాళ్ళకు భగవత్ప్రా ప్తి కలుగును?
అనే మాటలకి సమాధానము-
"ఏతి జీవన్తి మానందో నరం వర్ష శతాదపి"
అనే మాటతో స్పష్ఠమౌతుంది.

రాముని కుశలములు వినిన సీత ,
హనుమంతునిపై అద్భుతమైన ప్రీతితో ,
అభిమానము తో ఈ మాట చెపుతుంది.

వానరవీరుడు హనుమంతుడు శోకముతో దైన్యస్థితిలో నున్న సీత
విశ్వాసము తో చెప్పిన మాటలను విని ,
వృక్షముదిగి దగ్గరకు వచ్చుచుండెను.

అలా హనుమంతుడు దగ్గరకు వచ్చుచున్నకొలదీ
సీతకు మళ్ళీ అతడు రావణుడా అని శంక కలిగెను.
'అయ్యో ఇతడు రూపము మార్చుకొని వచ్చిన ఆ రావణుడే అయితే
ఇతనికి నేను చెప్పినమాటలతో చేయరాని పని చేసితిని' అని అనుకొనెను.
ఆ ఆలోచనతో ఆ సీత అశోకవృక్షముల శాఖలను వదిలి
శోకముతో నిండినదై భూమిమీద కూలబడెను.

ఆ మహాబాహువులు కల హనుమంతుడు దుఃఖములో మునిగియున్న,
భయపడియున్న జనకాత్మజను చూచి వందనము చేసెను.
భయముతో వణుకుచున్న సీత అతని వైపు కూడా చూడలేదు.
ఆ సీత దీర్ఘముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను విడచుచూ
వందనము చేసిన వానరుని తో మధురమైన స్వరముతో ఇట్లు పలికెను.

"నీవు స్వయముగా మాయవి రావణుడవైతే,
మాయతో ప్రవేశించి మరల నాకు సంతాపము కలిగిస్తున్నావు
అది శుభకరము కాదు.
స్వరూపమును త్యజించి పరివ్రాజక రూపములో జనస్థానములో
నాచేత చూడబడిన రావణుడవు నీవే.
ఓ కామరూపము ధరించగల నిశాచరుడా !
ఉపవాస దీక్షలో కృశించిన దీనురాలను
నాకు మరల సంతాపము కలిగించుట నీకు తగదు".

అలా అనిన సీతకి ఇంకా అనుమానమే.
అందుకని ఇంకా ఇలాచెపుతుంది.

"లేక నాకు కలిగిన ఈ శంక నిజము కాదేమో.
నీ దర్శనముతో నా మనస్సుకి ప్రీతి కలుగుచున్నది.
నీవు రాముని దూతవే అయితే నీకు మంగళమగు గాక.
ఓ వానరులలో శ్రేష్ఠుడా నాకు ప్రియమైన రామకథను గురించి అడుగుతున్నాను.
ఓ వానరుడా నా ప్రియుడగు రాముని గుణములు చెప్పుము.
ఓ సౌమ్యుడా నది ఒడ్డును హరించిన విధముగా నా మనస్సును హరిస్తున్నావు".

"ఇది స్వప్నము యొక్క సుఖము.
అపహరింపబడి తీసుకురాబడి నేను,
రాఘవునిచేత పంపబడిన వనచరుని మాత్రమే చూచుచున్నాను.
స్వప్నమే అయినా లక్ష్మణునితో కూడిన రామును చూచినచో కష్టములను దాటకలను.
కాని స్వప్నముకు కూడా నాపై దయలేదు .
నేను ఇది స్వప్నము అనుకోను.
వానరుని స్వప్నములో చూచినచో అభ్యుదయము కలగదు.
కాని నాకు ఆనందముతో అభ్యుదయము ప్రాప్తించి నట్లేయున్నది".

"ఇది చిత్త మోహమా?
ఇది వాతము వలన కలిగినది కాబోలు.
ఇది ఉన్మాదమో వికారమో.
ఇది ఎండమావిలాంటిది ఏమో.
కాని ఉన్మాదముకాదు. ఉన్మాద లక్షణము కాదు.
నేను వానరుని ప్రత్యక్షముగా చూచుచున్నాను".

సీత ఈ విధముగా అనేక విధములుగా
ఆలోచనల బలాబలములను గురించి తర్కించి
హనుమ కామరూపము ధరించిన రాక్షసాధిపుడే అని తలచెను.
అప్పుడు ఆ జనకాత్మజ ఈ విధముగా ఆలోచించి వానరునితో మాట్లాడకుండా ఉండెను.

రామ కథ రామ నామము రామ బాణము లాంటివి.
మారుతాత్మజుడగు హనుమంతుడు సీతయొక్క ఆలోచనలను గ్రహించి,
వినుటకు తగిన మాటలతో రాముని గుణములు వర్ణిస్తూ
సీతమ్మకు సంతోషము కలిగించెను.

" రాముడు ఆదిత్యునివలే తేజస్వి.
చంద్రునివలె లోకమునకు ఆహ్లాదపరచువాడు.
దేవుడు వైశ్రవణుని వలే అన్ని లోకములకు రాజు.
విష్ణువువలె మహాకీర్తి గలవాడు పరాక్రమశాలి. సత్యవాది.
బృహస్పతి వలె మధురమైన మాటలు చెప్పగలడు.
రూప సౌభాగ్యము గలవాడు, శ్రీమంతుడు,
మన్మధునివలె నుండు రూపము గలవాడు.
తగిన సమయములో క్రోధము చూపువాడు.
శిక్షింపతగిన వారిని శిక్షించువాడు.
లోకములో శ్రేష్ఠుడైన మహారథుడు.
లోకము ఎవరి బాహుచ్ఛాయలలో నడచునో అట్టి వాడు రాముడు.

ఆట్టి రాఘవుని మృగరూపములో ఆశ్రమపదమునుంచి దూరముగా తీసుకుపోయి,
శూన్యమైన ఆశ్రమపదమునుంచి నీవు అపహరింపబడితివి".

"దాని ఫలము నీవు చూచెదవు.
ఆ వీరుడు క్రొద్ధికాలములో రోషముతో ప్రయోగించబడిన
మంటలుక్రక్కుతున్న బాణములతో యుద్ధములో రావణుని సంహరించును.
నేను ఆయన చేత పంపబడిన దూతను ఇక్కడకు నీకోసమై వచ్చినవాడను.
నీ వియోగముతో దుఃఖములో మునిగియున్న ఆ రాముడు
నీ కుశలములను అడుగుచున్నాడు.
మహాతేజోవంతుడు అగు సుమిత్రానందనుడు మహాబాహువులు కల లక్ష్మణుడు
అభివాదముచేసి నీ కుశలములను అడుగుచున్నాడు.
ఓ దేవి రాముని సఖుడగు సుగ్రీవుడు అను పేరుగల వానరాధీశుడు.
ఆ రాజు నీ కుశలములను అడుగుచున్నాడు".

"ఓ వైదేహీ సుగ్రీవుడు లక్ష్మణులతో కలిసి రాముడు
నిన్ను నిత్యము తలచుకుంటూ వుంటాడు.
రాక్షసుల వశమైన నీవు,
జీవించివుండుట మా అదృష్టము.
మహాబలవంతుడైన రాముని లక్ష్మణుని
అలాగే కోటి వానరుల మధ్యలో నున్న అమిత తేజసము కల సుగ్రీవుని త్వరలో చూచెదవు.

నేను సుగ్రీవుని మంత్రిని.
హనుమంతుడని పేరుకలవాడను.
మహాసాగరమును దాటి లంకానగరమును ప్రవేశించితిని.
దురాత్ముడైన రావణుని తలపై కాలుపెట్టి,
నా పరాక్రమముతో నేను నిన్ను చూచుటకు ఇక్కడికి వచ్చితిని".

"ఓ దేవీ నీవు అనుకొచున్నట్లు రావణుని కాను.
ఈ విధమైన శంక వదలుము.
నేను చెప్పినది శ్రద్ధగా వినుము".

తను రావణుడు కాదు ,
రామదూతను అనే మాటతో హనుమంతుడు,
శంకల వలయములో చిక్కుకొని వున్న సీత మనస్సుకి ఆహ్లాదకరమైన మాటలతో,
రాముని వర్ణనతో సీతకి ఊరటకలిగించడానికి
సీతకు నమ్మకము కలిగించడానికి ప్రయత్నము చేస్తాడు.

రామ నామము, రామ కథ మనస్సుకి శాంతి కలిగిస్తాయి.
తన ముందున్న హనుమ మాయావి రావణుడేనేమో అని
శంకల వలయములో చిక్కుకున్నసీతమ్మకి
రాముని గుణముల వర్ణనతో ఊరట కలిగించి,
హనుమ తను రావణుడు కాదు,
రామ దూతను అనే మాటతో సీతమ్మకి నమ్మకము కలిగిస్తాడు.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది నాలుగవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్ ||

 

 

 

 

 

||ఓమ్ తత్ సత్ ||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||